: ప్రజలంతా పట్టణాలవైపు పరుగులు తీస్తున్నారు: బ్రిక్స్ సదస్సులో వెంకయ్య
ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణీకరణ తప్పనిసరి అయిందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) పట్టణాభివృద్ధి మంత్రుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పట్టణీకరణ జరుగుతున్న క్రమంలో వాటికి తగ్గ మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రస్తుతం మన ముందున్న సవాల్ అని ఆయన అన్నారు. ప్రజలంతా పట్టణాలవైపు పరుగులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. వాటిని ఎదుర్కోవడమే అజెండాగా బ్రిక్స్ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేశంలో పట్టణాల్లో నివసిస్తోన్న ప్రజలు 32 శాతం మంది ఉన్నారని ఆయన అన్నారు. దేశ జీడీపీలో అధికశాతం పట్టణాల నుంచే వస్తోందని, పట్టణాల నుంచి వచ్చే జీడీపీ శాతం 65గా ఉందని చెప్పారు. బ్రెజిల్లో 84శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జీ-20లో బ్రిక్స్‌లోని 5 దేశాలే బలంగా ఉన్నాయని ఆయన అన్నారు.