: కూర'గాయాలు'... వరుసగా ఐదవ నెలలోనూ పెరిగిన టోకు ధరల సూచి
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. అంతకుముందు జూలైలో 3.55 శాతం వద్ద ఉన్న ఇన్ ఫ్లేషన్, కూరగాయల ధరల పెరుగుదలతో పాటు ఆహార పదార్థాల ధరల వృద్ధితో ప్రభావితమై పైకెగసింది. దాదాపు ఏడాది పాటు ప్రతి దవ్యోల్బణం కొనసాగిన తరువాత, ద్రవ్యోల్బణం పెరుగుతూ రావడం ఇది వరుసగా ఐదవసారి. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ లో అధిక వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు ఆగస్టులో 2.42 శాతం పెరిగాయి. గత వారంలో విడుదలైన చిల్లర ద్రవ్యోల్బణం (రిటైల్ ఇన్ ఫ్లేషన్) ఐదు నెలల కనిష్టానికి పడిపోగా, తదుపరి ఆర్బీఐ పరపతి సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గిపు అంశం పరిశీలనకు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్న వేళ, టోకు ధరల సూచి గణాంకాలు కొంత అడ్డంకేనని భావిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఆగస్టులో బంగాళాదుంపల ధరలు 66.72 శాతం, ఉల్లిపాయల ధరలు 64.19 శాతం పెరిగాయి. పప్పుధాన్యాల ధరలు 34.55 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కన్స్యూమర్ ఇన్ ఫ్లేషన్ సూచికలో ఫుడ్ ప్రొడక్టుల ధరల పెరుగుదల తగ్గినట్టు గణాంకాలు వెల్లడి కావడంతో, ఆర్బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ వడ్డీ తగ్గింపు ఆలోచనకు మద్దతిచ్చేలా ఇవి ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ గణాంకాలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించివేశాయి. బెంచ్ మార్క్ సూచికలు ఒత్తిడిలో పడిపోయాయి. మధ్యాహ్నం 1:45 నిమిషాల సమయంలో సెన్సెక్స్, నిఫ్టీలు క్రితం ముగింపుతో పోలిస్తే 0.2 శాతం దిగజారాయి.