: 2019లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ జలగండం ఎదుర్కోక తప్పదు: భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్
మల్లన్నసాగర్ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి టీపీసీసీ నేతలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరిన అంశంపై టీఆర్ఎస్ నేత, భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ జలగండం ఎదుర్కోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతూ కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులకి అడ్డుపడుతున్నారని అన్నారు. వారు రాష్ట్రపతిని కలవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టవద్దని రాష్ట్రపతితో చెబుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతని, లక్షల ఎకరాలకు నీరందిస్తామని ఆయన పేర్కొన్నారు.