: 'బెంగళూరు ఐటీ'ని ఆదుకుంటున్న హైదరాబాద్ టెక్కీలు... ఏకబిగిన 36 గంటల పని!
కావేరీ నదీ జలాల వివాదం గాలివానగా మారి కర్ణాటక రాష్ట్రాన్ని స్తంభింపజేసిన వేళ, ఐటీ కంపెనీలపై ప్రభావం పడగా, హైదరాబాద్ ఐటీ రంగం ఆదుకుంది. బెంగళూరులోని 85 శాతం వరకూ ఐటీ కంపెనీలు మూతబడిన వేళ, కస్టమర్లకు సరైన సమయంలో సేవలను అందించేందుకు ఆయా ఐటీ సంస్థలకు చెందిన హైదరాబాద్ శాఖల కార్యాలయాలు రంగంలోకి దిగాయి. ఇక్కడి టెక్కీలు, గడచిన రెండు రోజుల్లో 36 గంటల వరకూ విధులు నిర్వర్తించారు. "హైదరాబాద్ ఐటీ కంపెనీల్లోని దాదాపు 25 వేల మంది టెక్కీలు బెంగళూరులో జరగాల్సిన పనులను చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి మరో రెండు రోజులు కుదురుకునేలా లేదు. తిరిగి కార్యాలయాలు ప్రారంభమయ్యే వరకూ హైదరాబాద్ నుంచే సేవలందుతాయి" అని కన్నడ రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి సి.రాజేందర్ వెల్లడించారు. బెంగళూరులో కీలకమైన ఐటీ సేవలను అందించే 90 వేల మంది ఉద్యోగులు తమ విధులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొని ఉందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలు సోమవారం రాత్రి నుంచి తెరచే ఉన్నాయి. మంగళవారం రాత్రి కూడా నిద్ర లేకుండా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు, తమ మిత్రుల పని కూడా చేసి పెట్టారు. "నిన్న అర్ధరాత్రి నా విధులు ముగిసిన తరువాత, నా డెస్క్ మీదనే నిద్రపోయాను. ఈ రోజు కూడా నేను ఇంటికి వెళ్లేది అనుమానమే. నాకు కాంపెన్ సేటరీ ఆఫ్ లభిస్తుందనుకున్నా, దాన్ని మరికొన్ని రోజులు తీసుకునే పరిస్థితి లేదు. బెంగళూరులో పరిస్థితి మెరుగుపడే వరకూ మా ఏడుగురు సభ్యుల మిత్రబృందానికి సెలవు తీసుకునే అవకాశం కూడా లేదు" అని ప్రముఖ ఐటీ సంస్థలో టెక్నికల్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఎ.రవీందర్ వెల్లడించారు. తాము డెడ్ లైన్లను అందుకోవాల్సి వుంటుందని, కస్టమర్ల నుంచి మాట పడకూడదన్నదే తమ అభిమతమని మరో ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవి వ్యాఖ్యానించారు. బెంగళూరు ఐటీ కంపెనీలకు చెందిన పెండింగ్ వర్క్ ను అత్యధికంగా హైదరాబాద్ కంపెనీలు పంచుకుంటుండగా, మరికొన్ని పనులు పుణె, చెన్నై, ఢిల్లీల్లోని కంపెనీలు అందుకున్నాయని తెలుస్తోంది. కాగా, గతంలో చెన్నైని వరదలు చుట్టుముట్టిన వేళ కూడా హైదరాబాద్ టెక్కీలు రంగంలోకి దిగి వర్క్ లోడ్ పంచుకున్నారు.