: బ్రిటన్ బిడ్డ ఇండియాలో అనాథగా మిగలాల్సిందేనా?: సుష్మా స్వరాజ్ సీరియస్ ట్వీట్
ఇండియాకు వచ్చి అద్దెగర్భం విధానంలో బిడ్డను కన్న ఓ బ్రిటన్ జంట, తమ బిడ్డకు పాస్ పోర్టును సంపాదించుకోవడంలో విఫలమై, ఆ చిన్నారిని అనాథాశ్రమంలో వదలాలని నిర్ణయం తీసుకోవడంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. సరోగసీ విధానంలో పుట్టిన బిడ్డ అనాథగా మిగలాల్సిందేనా? అంటూ, తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్ ప్రశ్నలను సంధించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, క్రిస్, మిచెలే న్యూమన్ దంపతులు మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చి అద్దెగర్భాన్ని తీసుకుని ఓ బిడ్డను కన్నారు. వీరి వీసా గడువు అక్టోబర్ 7తో ముగియనుంది. వీరి బిడ్డ లిలీకి ఇప్పుడు మూడు నెలల వయసు కాగా, అక్టోబర్ 7లోగా ఆ బిడ్డ బ్రిటన్ ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించే పరిస్థితి కనిపించలేదు. దీంతో 'చేంజ్ డాట్ ఆర్గ్' వేదికపై, తాము తమ బిడ్డను బలవంతంగా ఇండియాలో వదిలేసి వెళ్లాల్సి వస్తోందని ఆ దంపతులు వాపోయారు. విషయం తెలుసుకున్న సుష్మా, బ్రిటన్ అధికారులను టార్గెట్ చేస్తూ, బిడ్డను అనాథను చేస్తారా? అని ట్వీట్ చేశారు. ఎవరైనా న్యాయనిపుణులు వాణిజ్య సరోగసీ విధానంలో భారత గడ్డపై పుట్టిన ఈ బిడ్డకు సాయం చేయగలరా? అని అడిగారు. ఇదిలావుండగా, సుష్మా నిజంగా వారికి సాయం చేయాలని భావిస్తే, గడువు ముగిసిన ఆ దంపతుల వీసాను మరోమారు పొడిగించాలని కొందరు న్యాయవాదులు చెప్పారు. ఇండియాలో వాణిజ్య సరోగసీపై నిషేధం ఇటీవల అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందే న్యూమన్ దంపతులు భారత్ లో కమర్షియల్ సరోగసీ విధానంలో పుట్టిన ఆఖరి బిడ్డ లిలీయేనని తెలుస్తోంది. లిలీ పాస్ పోర్ట్ దరఖాస్తు జూన్ 3 నుంచే యూకే అధికారుల ముందు ఉండగా, పాస్ పోర్ట్ మాత్రం ఇంతవరకూ లభించలేదు. అధికారులు పాపకు పాస్ పోర్టు జారీ చేసే విషయంలో బ్రిటీష్ జాతీయతను పరిశీలించాల్సి వుందని అంటుండటం గమనార్హం.