: ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డ అమిత్ షా.. కేరళ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డారు. ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసులకు అమిత్ షా ఓనం శుభాకాంక్షలు అని ట్వీట్ చేయకుండా ‘వామన జయంతి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కేరళ వాసుల మనోభావాలు దెబ్బతీసినట్లయింది. అమిత్ షా ట్వీట్‌పై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సైతం స్పందించాల్సి వచ్చింది. అమిత్ షా కేరళ వాసులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహాబలి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కేరళలో ఘనంగా చేసుకునే పండుగే ఓనం. బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేయడానికి విష్ణుమూర్తి వామనావతారం ఎత్తిన విషయం తెలిసిందే. బలిచక్రవర్తి తలపై కాలుపెట్టి విష్ణుమూర్తి ఆయనను పాతాళంలోకి తొక్కేసే సమయంలో బలిచక్రవర్తికి ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు అవకాశం ఇస్తూ వరమిస్తాడు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఓనం పండుగ జరుపుకుంటూ బలిచక్రవర్తి తమ ఇంటికి వచ్చి తమను చూసి సంతోషంగా ఉండడంటూ దీవిస్తాడని కేరళవాసుల నమ్మకం. అయితే, అలాంటి రోజున విష్ణువు అవతారమయిన ‘వామన జయంతి’ అని అమిత్ షా ట్వీట్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. ఆ రాష్ట్ర ప్రజలు అమిత్ షాపై మండిపడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఈ అంశంపై స్పందించిన వెంటనే, హ్యాపీ ఓనం అని పేర్కొంటూ అమిత్ షా మరో ట్వీట్ చేయాల్సి వచ్చింది.