: సోనియా తన బిడ్డను ప్రధాని చేయాలనే దురుద్దేశంతోనే రాష్ట్రాన్ని విడగొట్టారు!: కావూరి
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తమ ప్రభావం కోల్పోయిన కారణంగానే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయం చేసి రాష్ట్రాన్ని విడగొట్టారని బీజేపీ నేత కావూరి సాంబశివరావు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతం నుంచి అన్ని సీట్లు తమకే వస్తాయని భావించి, తమ బిడ్డ రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తాను కోరినట్లు కావూరి పేర్కొన్నారు. రాజకీయాలు చెప్పలేనంతగా చెడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాలను ప్రజలు చీదరించుకునే పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఇప్పుడు లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే ముందు సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.