: ఏపీలో 100 శాతం విద్యుదీకరణ... దేశంలో ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రంగా రికార్డు
దేశంలో పూర్తి విద్యుదీకరణ జరిగిన రెండో రాష్ట్రంగా గుజరాత్ తరువాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. దేశవ్యాప్తంగా గృహాల విద్యుదీకరణపై సర్వే నిర్వహించిన జేఎం ఫైనాన్షియల్స్, తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జూన్ చివరి నాటికే రాష్ట్రం 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించిందని, ఇక ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాపై దృష్టిని సారించాల్సి వుందని తెలిపారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో విద్యుదీకరణ కీలకమైన అంశమని గుర్తు చేసిన ఆయన, దీన్ని త్వరితగతిన సాధించిన అధికారులకు అభినందనలు తెలిపారు. విద్యుత్ రంగంలో గడచిన రెండేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆయన సూచించారు. కాగా, ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం గృహాలకు విద్యుత్ సరఫరా లేదని జేఎం ఫైనాన్షియల్స్ వెల్లడించింది.