: 'కుక్క కావాలా? నేను కావాలా?' అంటే కుక్కే కావాలన్న యువతి... వివాహం కేన్సిల్!


నేటి యువత అభిరుచులకు అంత్యత ప్రాముఖ్యతనిస్తున్నారని తెలిపే ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కోసం ఏకంగా తన వివాహాన్ని రద్దు చేసుకుని ఓ యువతి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియాకు అన్ని విధాలా సరిపడా వ్యక్తిగా భావించిన వ్యక్తితో పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. దీంతో వారిద్దరి మధ్య ఛాటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో వివాహానంతరం తాము ఎలా ఉండాలనుకుంటున్నది, భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నది వివరంగా ఛాట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అందులో భాగంగా 'తనకు పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టమని, వివాహానంతరం కూడా దానిని తనతోపాటే ఉంచుకోవాలనుకుంటున్నా'నని కరిష్మా తెలిపింది. 'నిజానికి తన తల్లికి కుక్కలంటే పెద్దగా ఇష్టం ఉండదని, అయినా పానకంలో పుడకలా మన మధ్య కుక్క ఎందుకు?' అని ఆ యువకుడు ప్రశ్నించాడు. దీంతో కరిష్మాకు కోపం వచ్చింది. 'కుక్కను వద్దంటే తాను కూడా వివాహానికి దూరంగా ఉంటానని, వివాహానంతరం కుక్క కారణంగా కలతలు రాకూడదనే చెబుతు'న్నానని తెలిపింది. తొలుత దీనిని తేలిగ్గా తీసుకున్న ఆ యువకుడు తరువాత ఆమె కాస్త ఆగ్రహం వ్యక్తం చేసేసరికి, 'కుక్కతో ఎవరైనా పెళ్లిని రద్దు చేసుకునేంత అనుబంధం పెంచుకుంటారా?' అని అడిగాడు. దీనికి ఆమె 'అవును' అని సమాధానం చెప్పడంతో షాక్ తిన్న ఆ వ్యక్తి ఆమెను 'సీరియస్ గానే చెబుతున్నావా?' అని అడగడంతో 'దీనిపై ఇంక మాటలు అనవసరం' అని ఆమె స్పష్టం చేసింది. దీంతో 'మనిద్దరి భవిష్యత్ ముఖ్యమని, కుక్కతో నీ అనుబంధం తాత్కాలికమే'నంటూ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె 'కుక్క కోసం పెళ్లినైనా వదులుకుంటా'నని చెప్పడంతో, 'సరే అయితే కుక్కనే వివాహం చేసుకో' అని చెప్పాడు. 'ఈ విషయంపై తమ ఇద్దరి మధ్య ఇకపై వాదనలు అనవసర'మని, ఆమె సూటిగా చెప్పడంతో, వారి ఛాట్ కు ఫుల్ స్టాప్ పడింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రెండు వర్గాలుగా మారిన యువత కొంత మంది యువతి, మరికొందరు యువకుడికి మద్దతు పలుకుతున్నారు.

  • Loading...

More Telugu News