: విశాఖలో భారీ బందోబస్తు...బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్టణంలో బ్రిక్స్ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధానంగా సదస్సు నిర్వహించనున్న ప్రాంతంతో పాటు, అతిథులు బస చేయనున్న పలు హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో విశాఖపట్టణాన్ని సుందరీకరించారు. ఇందుకోసం సుమారు 54 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇందులో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెంట్రల్ ఉడా పార్కును ప్రారంభించనున్నారు. కేజీహెచ్ డౌన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వున్న ప్రాంతమంతా బీచ్ రోడ్డు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వచ్చీపోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం కూడా కావడంతో పలు రహదారులు, వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.