: 'బిచ్చగాడు' హీరోయిన్ రహస్య వివాహం
'పిచ్చైక్కారన్' ('బిచ్చగాడు') సినిమా హీరోయిన్ సాట్నా టైటస్ రహస్యంగా వివాహం చేసుకుంది. తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయం సాధించిన 'బిచ్చగాడు', తెలుగులో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ సినిమాతో హీరోయిన్ గా సాట్నా టైటస్ పరిచయమైంది. దీంతో కోలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమాను తమిళనాట పంపిణీ చేసిన బయ్యర్ కార్తీతో సాట్నా ప్రేమలో పడింది. దాంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా నెల రోజుల క్రితం ఈ ప్రేమ జంట రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. దీంతో తాను నటించేందుకు అంగీకరించిన 'తిట్టం పోట్టు తిరుడర కూట్టం' అనే చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ ను ఆమె తిరిగి ఇచ్చేసింది. మరోపక్క, అమీర్ దర్శకత్వంలో 'సంగదేవన్' సినిమాలో నటించేందుకు అంగీకరించగా, దాని పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాహం పట్ల సాట్నా తల్లి ఆగ్రహంగా ఉన్నారని, తన కుమార్తెను కార్తీ మాయలో పడేశాడని, అతని నుంచి సాట్నాను విడిపించాలంటూ ఆమె నడిగర్ సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.