: వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు
హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నామని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిమజ్జనం సందర్భంగా పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్-10, అప్పర్ ట్యాంక్ బండ్ పై 24 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. నిమజ్జనం సందర్భంగా చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా హైదరాబాద్ నగరం మొత్తం మీద 12 వేల సీసీ కెమెరాల నిఘా ఉందని ఆయన తెలిపారు. నిమజ్జనం రూట్ లో 2 వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు పహారా కాయనున్నాయి. మహిళల భద్రతకు రంగంలోకి 100 షీ టీమ్ లు దిగాయని, మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించే అల్లరి మూకల అంతు చూస్తాయని ఆయన తెలిపారు. నిమజ్జనం సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.