: మరోసారి యాక్సిడెంట్ తో షాక్ కు గురైన రమ్య కుటుంబ సభ్యులు
హైదరాబాదులోని పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మృత్యువాత పడిన చిన్నారి రమ్య కుటుంబానికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల క్రితం జరిగిన ఆ నాటి ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య మరణించిన విషయం తెలిసిందే. కాగా, రమ్య తల్లి, తండ్రితో కలిసి రాజేశ్ భార్య (రమ్య పిన్ని) శిల్ప కాప్రా నుంచి నల్లగొండకు కారులో వెళ్తుండగా, బైక్ పై వేగంగా దూసుకువచ్చిన ఓ మైనర్ వారి కారును ఢీ కొట్టాడు. దీంతో మరోసారి రమ్య కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఇఫ్పటికే ఒక ప్రమాదంతో జరిగిన అపార నష్టంతో తమ కుటుంబం తీవ్ర వేదనలో ఉందని, మరోసారి ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణాలు మానుకోవాల్సి వస్తోందని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.