: మూఢనమ్మకాలు వద్దంటూ నిప్పులపై నడిచిన ఐజీ, మహిళా ఎస్పీ
ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాల నుంచి బయటపడలేక ఎంతో మంది ప్రజలు వాటికి బలవుతూనే ఉన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ అనే తేడా లేకుండా అందరూ మూఢనమ్మకాల వలలో చిక్కుకొని ఎన్నో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తోన్న సంఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఛత్తీస్గఢ్లో ఇటువంటి ఘటనలు అధికంగా కనిపిస్తున్నాయి. వాటిని కట్టడి చేయాలని నిర్ణయించుకున్న ఓ పోలీస్ ఐజీ, ఓ మహిళా ఎస్పీ చెప్పులు లేకుండా నిప్పులపై నడిచారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్లోని మంగేలి ప్రాంతంలో జరిగింది. ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వారు ఈ సాహసం చేశారు. ప్రజలందరినీ ఒక చోటకు పిలిచిన పోలీసులు ఓ నిప్పుల కొలిమి ఏర్పాటు చేశారు. చేతబడి, బాణామతి అంటూ మంత్రగాళ్లు ప్రజలని ఎలా మోసగిస్తారనే విషయాన్ని బిలాస్పూర్ కు చెందిన ఐజీ వివేకానంద్, ముంగేలి ఎస్పీ నీతు కమల్ వివరించి చెప్పారు. అమాయక ప్రజలను వారు మోసానికి గురి చేసే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. నిప్పులపై నడిచి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. అక్కడికి వచ్చిన పలువురు విద్యార్థులు, గ్రామస్తులతో కూడా నిప్పులపై నడిపించారు. మూఢవిశ్వాసాలు ఇకపై విడిచి పెట్టేస్తామని వారితో చెప్పించారు. ముంగేలీలో మూఢనమ్మకాలతో ఈ తరహా కేసులు ఎక్కువవుతుండడంతో పోలీసులు ఈ ప్రయోగం చేశారు.