: కావేరి జగడం నేపథ్యంలో... బస్సుల్లేక ఓ వధువు పాదయాత్ర... కర్ణాటక నుంచి తమిళనాడుకు పయనం
కావేరి జల వివాదం ఓ వధువు కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టింది. తమిళనాడు, కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. బెంగళూరుకు చెందిన ప్రేమకు తమిళనాడులోని వినియంబాడిలో బుధవారం ఓ వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు రోజే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో వధువుతోపాటు ఆమె కుటుంబం మంగళవారం ఉదయం తమిళనాడుకు బయల్దేరింది. కానీ, తమిళనాడుకు బస్సుల్లేవు. దీంతో అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని కొద్ది దూరం వెళ్లి అక్కడి నుంచి తమిళనాడుకు కాలినకడన బయల్దేరారు. ‘సంతోషాన్ని కోల్పోతున్నాం. ఈ రోజు మరపురానిది. 600 మందిని పెళ్లికి పిలిస్తే కేవలం 20 మందే వస్తున్నారు’ అని వధువు ప్రేమ ఆవేదన వ్యక్తం చేసింది. ఆందోళనలు సరికావని, మనమంతా భారతీయులమని చెప్పింది.