: కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు కఠిన చర్యలు చేపట్టాలి: వెంకయ్యనాయుడు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాలు రేపిన చిచ్చు రావణకాష్టంలా రగులుతోంది. కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇదే సమయంలో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాంతి నెలకొనాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. భద్రతా దళాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ముఖ్యమంత్రులు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆందోళనలు హింసాత్మకంగా మారకూడదని ఆయన తెలిపారు.