: నడిగర సంఘం నుంచి శరత్ కుమార్, రాధారవి సస్పెన్షన్
నడిగర సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) నుంచి తమిళ సీనియర్ నటుడు, మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. నడిగర సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యనిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపిన కార్యవర్గ సభ్యులు, తాము నిర్వహించిన శోధనల్లో గత కార్యవర్గం చేసిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని, దీంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ప్రకటన విడుదల చేసింది. తనిఖీల్లో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఈ ముగ్గురి ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం చర్యలు ఉంటాయని వారు తెలిపారు.