: భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాలీవుడ్ నటుడు!
'ట‌్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమా భారత్ లో విజయం సాధించేందుకు ఈ సినిమా యూనిట్ భారీ ప్రణాళికలు రచించింది. ఇందులో నటిస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా సినిమాకు సంబంధించిన ప్రతి విశేషాన్ని దీపికా పదుకునే ద్వారా విడుదల చేయిస్తూ ప్రమోషన్ చేసుకుంటోంది. తాజాగా దీపికా పదుకునే తన ఇన్ స్టా గ్రాంలో విన్ డీజిల్ తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ఇప్పటికే ట్రైలర్ లో మంచి కెమెస్ట్రీ పండించిన ఈ జంట, ఈ ఫోటో ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యసాచి ముఖర్జీ రూపొందించిన షేర్వాణీని గతంలో విన్ డీజిల్, ఈ సినిమా దర్శకుడు డీజే కారుసోకు దీపికా బహుమతిగా ఇచ్చింది. ఈ దుస్తులు ధరించిన విన్ డీజిల్ భారతీయ వరుడిలా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదల కానుంది.