: ఆ ప్రేమికుల పార్కులో 311 భాషల్లో ‘ఐ లవ్ యూ’ కనిపిస్తుంది!
పారిస్‌లోని మౌంట్‌మార్టర్‌లో అబ్బెసెస్ అనే పార్కు ఎప్పుడు చూసినా ప్రేమ జంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఎన్నో ప్రేమ జంటలు పార్కుకి వచ్చి కబుర్లు చెప్పుకుంటాయి. తమ మనసులోని భావాలని, ఆశలని ప్రేమికులు ఆ పార్కులో ఒకరికొకరు చెప్పుకుంటారు. ఎన్నో జంటలు ఐ లవ్ యూ అనే పదాన్ని ఉపయోగిస్తుంటాయి. ఆ పదాన్ని ఇద్దరు కళాకారులు ఆ పార్కులో మరింత రమ్యంగా మార్చేశారు. ఫ్రెడరిక్ బారొన్, క్లెయర్ కిటొ అనే ఇద్దరు కళాకారులు అక్కడ ఉన్న ఓ గోడపై 'ఐ లవ్ యూ' అనే పదాలతో నింపేశారు. అయితే ఆ పదాలన్నీ ఒకే భాషలో రాసినవి కాదు. ఒక్కో ఐ లవ్ యూ పదాన్ని ఒక్కో భాషలో రాశారు. మొత్తం 311 భాషల్లో వెయ్యి ప్రేమ వ్యక్తీకరణ పదాలను రాసేశారు. దీంతో అబ్బెసెస్ పార్కు మరింత ప్రేమను వెదజల్లేలా తయారయింది. ఈ పదాలను రాయడానికి ఫ్రెడరిక్ బారొన్, క్లెయర్ కిటొ ఎంతో మంది వ్యక్తులను కలిశారు. పలు దేశాల దౌత్య కార్యాలయాల్లో అధికారులను అడిగి ‘ఐ లవ్ యూ’ అనే అర్థం వచ్చే పదాలను తెలుసుకొని పార్కులో గోడపై రాశారు. అబ్బెసెస్ పార్కులో ఉన్న గోడపై 40 చదరపు మీటర్ల మేర నీలిరంగు బండలపై ‘నిన్ను నేను ప్రేమిస్తున్నాను’ అని అర్థం వచ్చే ఈ ప్రేమ పదాలు కనిపిస్తాయి. వీరిరువురూ చేసిన ఈ పని పార్కుకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. పార్కుకి వచ్చిన ప్రేమికులు ఈ 311 భాషల్లో ఉన్న పదాల సాక్షిగా చేతిలో చెయ్యేసి ఎప్పటికీ విడిపోకూడదని ప్రమాణాలు చేసుకుంటున్నారు.