: రైల్వేస్టేషన్లలో తాగునీరు అత్యంత ప్రమాదకరమట!
రైల్వేస్టేషన్లలోని మంచినీరు తాగితే రోగాల బారిన పడటం ఖాయమట. రైల్వే ప్రయాణికులకు భారత్ రైల్వే శాఖ అందిస్తున్న సేవలు చాలా దారుణంగా ఉన్నాయన్న విషయం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఈఎస్) తాజా ప్రకటన ద్వారా వెల్లడైంది. జాతీయ ఆరోగ్య, పర్యావరణ సంస్థ, జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో బయటపడిన వివరాలను పేర్కొంది. రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ప్రతి 100ఎమ్ఎల్ నీటిలో 10 యూనిట్ల థర్మోటోలరెంట్ క్లోరోఫామ్ బ్యాక్టీరియా ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఈ నీటిని తాగడం వల్ల డయేరియా, ఉదర సంబంధ వ్యాధులు, గాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని రైల్వేస్టేషన్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని, ఢిల్లీ, పంజాబ్, గజియాబాద్,వారణాసి తదితర ప్రాంతాల రైల్వేస్టేషన్లలోని తాగునీటిలో ఈ బ్యాక్టీరియా ప్రభావం ఎక్కువగా ఉందని ఆ పరిశోధన ద్వారా తెలిసిందని బీఈఎస్ ప్రకటనలో పేర్కొంది. అయితే, రైల్వే అధికారుల వాదన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కొన్ని రైల్వే స్టేషనల్లో మాత్రమే ఇటువంటి పరిస్థితి ఉందని, కొన్ని చోట్ల నిర్వహణా లోపాలు ఉన్నాయని అన్నారు. ప్రతి స్టేషన్ లోను నీటిని శుద్ధి చేసి ఉచితంగా తాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.