: ప్రజలకు అనుమానాలు, అపోహలు కలిగించడం మంచిది కాదు: మంత్రి ప్రత్తిపాటి ఫైర్
రెయిన్‌గన్‌ల పంపిణీ ద్వారా రాయలసీమలో కరవు పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వినూత్నమైన ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వీటిపై కూడా విమర్శలు చేస్తూ ప్రజల్లో అనుమానాలు, అపోహలు కలిగించడం మంచిది కాదని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. రైతులకు మేలు జరిగితే ఏడవకూడదు.. సంతోషించాలి.. అని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. అవసరం ఉన్న ప్రతిచోట రెయిన్‌గన్లను పంపిణీ చేశామని అన్నారు. రైతులు బాగుపడుతున్నా తట్టుకోలేకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటివరకు 6,442 రెయిన్ గన్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కరవుపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రెయిన్ గన్ల ప్రయోగం కరవుపై బ్రహ్మాస్త్రంలా ఉందని చెప్పారు. అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదని ఇటీవల వైసీపీ ప్రదర్శించిన తీరుపై ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో బెంచీలు ఎక్కి కాగితాలు విసిరే పద్ధతి ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలోనే జరగకూడని అన్ని ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అసెంబ్లీ నిబంధనలను కాలరాస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షం అంటే రౌడీయిజం, దౌర్జన్యం చేయడం కాదని ఆయన హితవు పలికారు. అసెంబ్లీ గౌరవం పడిపోతోందని ఆయన అన్నారు. సమావేశాలు 15 రోజులు జరపాలని విమర్శలు చేశారు. కనీసం మూడు రోజులు కూడా సభను సక్రమంగా జరగనివ్వలేదని ప్రత్తిపాటి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించమని చెప్పినట్లు, సూచనలివ్వమని కోరినట్లు ఆయన చెప్పారు. అయినా కూడా వైసీపీ ఒప్పుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు స్పష్టంగా సూచనలు ఇవ్వమని చెబుతున్నా ఎవ్వరూ ముందుకు రావట్లేదని ఆయన అన్నారు. కేవలం ప్రజల్ని ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో తమపై బురద చల్లాలనే ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆయన అన్నారు.