: తెలంగాణకు భారీ వర్షసూచన.. అప్రమత్తంగా ఉండండి: అధికారులకు కేసీఆర్ ఆదేశం
అల్పపీడన ప్రభావంతో రాగల మూడు రోజుల వరకు తెలంగాణ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో ఈ విషయంపై సీఎం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలతో సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి తో ఆయన ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్‌లోనూ చర్యలు తీసుకోవాలని సూచించారు.