: 'రూపాయి' చిల్లర విషయంలో వివాదం... హైదరాబాదులో పలు రూట్లలో రోడ్డెక్కని సిటీ బస్సులు!
హైదరాబాద్ లో ఈ ఉదయం సిటీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆపై ఒకటీ అరా డిపోల నుంచి బయటకు వచ్చినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేదు. దీంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముందస్తు ప్రకటనా లేదు, సమ్మె వార్తలూ రాలేదు. బస్సులు ఎందుకు నిలిచాయా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఇక బస్సులన్నీ ఒకేసారి ఎందుకు రోడ్లపైకి రాలేదో ఆర్టీసి వర్గాలు సమాచారం అందించాయి. కేవలం ఒక్క రూపాయి కోసం ఓ మహిళా కండెక్టరు, ప్రయాణికురాలి మధ్య జరిగిన తగాదాయే హైదరాబాద్ లో రోడ్లపైకి రావాల్సిన సగం బస్సులను అడ్డుకుంది. ఆర్టీసీ వర్గాల సమాచారం ప్రకారం, ఉప్పల్ డిపోలో పనిచేస్తున్న రత్నకుమారి అనే కండక్టర్, విధులు నిర్వహిస్తున్న వేళ, ఓ ప్రయాణికురాలికి ఇవ్వాల్సిన రూపాయి చిల్లరపై వాగ్వాదం జరిగింది. తన వద్ద చిల్లర లేదని రత్నకుమారి, రూపాయి కోసం ఆ ప్రయాణికురాలు ఒకరిపై ఒకరు వాదులాడుకున్నారు. అనంతరం సదరు ప్రయాణికురాలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు ప్యాసింజర్ తో అనుచితంగా ప్రవర్తించావంటూ రత్నకుమారిని సస్పెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలు డిపోల కార్మికులు మూకుమ్మడి సమ్మెకు దిగారు. కొన్ని యూనియన్ల ఉద్యోగుల నుంచి మద్దతు లభించలేదు. దీంతో సగం బస్సులు డిపోలకు పరిమితం కాగా, చాలీ చాలని సంఖ్యలో బస్సులు తిరుగుతున్నాయి.