: ముఖేష్ అంబానీ 'జియో'కు పోటీగా దీటైన ఆఫర్ ప్రకటించిన తమ్ముడు అనిల్ అంబానీ; రూ. 40కి ఫుల్ టాక్ టైం, 1 జీబీ డేటా
ఉచితకాల్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ అంటూ సంచలన ఆఫర్లతో వచ్చిన రిలయన్స్ జియోను నిలువరించేందుకు మిగతా టెల్కోలు తమదైన శైలిలో తగ్గింపు రేట్లను ప్రకటిస్తున్న వేళ, ముఖేష్ అంబానీ సోదరుడు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ, కొత్త ఆఫర్ ను ప్రకటించారు. రిలయన్స్ సిమ్ వాడుతున్న ప్రీపెయిడ్ జీఎస్ఎం ఖాతాదారుల కోసం రూ. 40 రీచార్జ్ తో పూర్తి టాక్ టైం, 1 జీబీ డేటాను అందించనున్నట్టు వెల్లడించారు. గతంలో రూ. 40తో రిలయన్స్ సిమ్ ను రీచార్జ్ చేసుకుంటే రూ. 32 టాక్ టైం వచ్చేది. ఇప్పుడు పూర్తి టాక్ టైంను ఇస్తామని చెప్పిన అనిల్ అంబానీ, అదనంగా ఇస్తున్న రూ. 8 టాక్ టైంను పది రోజుల్లో వాడుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ టాక్ టైం ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, 1 జీబీ డేటాను పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన తొలి సంస్థ ఆర్ కామ్ కావడం విశేషం. ఇక జియోకి పోటీగా అనిల్ ప్రకటించిన ఈ ఆఫర్ పై మొబైల్ వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.