: తమిళులైనా, కన్నడిగులైనా మేం చెప్పినట్టు వినాలి... ప్రజలు చట్టాన్ని గౌరవించాలి!: సుప్రీంకోర్టు
తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కర్ణాటక సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రజలు కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, తమిళులైనా, కన్నడిగులైనా తామంతట తాము చట్టంగా వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. రెండు రాష్ట్రాలూ చట్టాన్ని గౌరవించాలని, తాము ఎన్నో ఆలోచించే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు చెబితే వినాలంటూ.. నిరసనలకు దిగుతూ సాధారణ ప్రజా జీవనాన్ని ఇబ్బందులు పెడుతున్నవారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. అధికారులు కల్పించుకుని శాంతిభద్రతలు కాపాడాలని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని కోరింది. ఈ నెల 5న ఇచ్చిన తీర్పును సవరిస్తూ, 15 వేల క్యూసెక్కులకు బదులుగా 12 వేల క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకూ తమిళనాడుకు నీటిని వదలాల్సిందేనని కర్ణాటకకు ఆదేశాలిస్తూ, కావేరీ జలాల వివాదంపై తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.