: 7 వేల మంది చైనా కార్మికులకు రక్షణగా 15 వేల మందిని రంగంలోకి దించిన పాకిస్థాన్
చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో పనులు నిర్వహిస్తున్న 7,036 మంది చైనా కార్మికులకు రక్షణగా 14,503 మంది సైనికులను రంగంలోకి దించింది. సీపీఈసీ పనులు జరుగుతున్న ప్రాంతంలో బెలూచ్ జాతీయులు అడ్డంకులు కల్పించవచ్చని, తాలిబాన్ దాడులు జరగవచ్చన్న అనుమానాలతో చైనా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేసినట్టు పాక్ వెల్లడించింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల సీపీఈసీ రహదారి నిర్మాణం పనులు పూర్తయితే, చైనాలోని కస్ ఘర్, బెలూచిస్థాన్ ప్రాంతంలోని గ్వదార్ పోర్టు మధ్య ఎకనామిక్ కనెక్టివిటీ పెరిగి, పాక్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నది ఆ దేశ అభిప్రాయం. పంజాబ్ రాష్ట్రంలో 6,364 మంది, బెలూచిస్థాన్ లో 3,134 మంది, సింధ్ లో 2,654 మంది, ఖైబర్ ఫక్తుంక్వాలో 1,912 మంది, ఇస్లామాబాద్ లో 439 మంది భద్రతా దళ సిబ్బంది చైనీయులకు రక్షణగా ఉన్నారని పాక్ పీపుల్స్ పార్టీ సభ్యుడు షాహిదా రెహమాన్ అడిగిన ప్రశ్నకు పాక్ సర్కారు సమాధానంగా చెప్పింది. ఇరాన్ లో భారత్ అభివృద్ధి చేసిన చబాహార్ పోర్టుకు దగ్గర్లోని గ్వదార్ పోర్టు పాక్ కు ఎంతో కీలకం. చాబహార్ పోర్టు నుంచి ఆఫ్గన్ కు రహదారి మార్గం ద్వారా సహాయం చేయాలని భారత్ నిర్ణయం తీసుకోగా, పాక్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.