: శ్రీరాముడు ఆ ముస్లిం వ్యక్తి కలలోకొచ్చాడు.. రామకోటి రాస్తున్న ముస్లిం కుటుంబం
వరంగల్ జిల్లాలోని హన్మకొండ, కాపువాడ వాసులయిన ఓ ముస్లిం కుటుంబం సర్వమతాలు ఒక్కటేనన్న సందేశాన్ని తెలుపుతోంది. రామకోటి రచనకు ఇప్పటికే శ్రీకారం చుట్టిన వారు తాజాగా వినాయక చవితి సందర్భంగా గణనాథుని విగ్రహాన్ని తమ ఇంట్లో ప్రతిష్ఠించారు. ఎండీ.యాకూబ్‌పాషా, యాస్మిన్ దంపతులు అన్ని మతాలు ఒకటేనన్న భావంతో ఆధ్యాత్మిక చింతనను తమ జీవనంలో భాగంగా చేసుకున్నారు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన యాకూబ్‌పాషా గత ఏడాది తమ జిల్లాలోని గణేష్‌నగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పనిచేశాడు. శ్రీరామ స్తూపం నిర్మాణ పనుల్లో పాల్గొన్న ఆయనకు భద్రాచలంలోని శ్రీరాముని విగ్రహం కలలో కనిపించింది. దీంతో ఆయన భద్రాచలం రాములోరి సన్నిధికి వెళ్లి స్వామిని దర్శించుకున్నాడు. అనంతరం రామకోటి రచనకు శ్రీకారం చుట్టాడు. అంతేకాదు, శ్రీరాముని చిత్రపటాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి భార్య, పిల్లలతో కలిసి పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ కలిసి శ్రీరామ కోటి రాస్తున్నారు. తాము ప్రతిరోజు నమాజ్ చేస్తామని.. అలాగే ఉదయం, సాయంత్రం రాముని చిత్రపటానికి దండం పెట్టుకుంటామని చెప్పాడు.