: సినీ నటుల మధ్య వివాదంగా మారుతున్న కావేరీ జలాలు!
కర్ణాటక, తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఇప్పుడు రెండు రాష్ట్రాల సినీ పరిశ్రమనూ తాకింది. కర్ణాటక ప్రభుత్వానికి మద్దతుగా శాండల్ వుడ్ స్టార్స్ ధర్నా నిర్వహించి జయలలితకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వేళ, కోలీవుడ్ గట్టిగానే స్పందించింది. కావేరీ నదీ జలాల పరిరక్షణకు ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం తీసుకునే చర్యలకు అండగా ఉంటామని నడిగర సంఘం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే తమ పయనం ఉంటుందని సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ వెల్లడించాడు. సంఘం ప్రతినిధులు అత్యవసర సమావేశం జరిపి అమ్మ సర్కారుకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆపై విశాల్ మాట్లాడుతూ, శాండల్ వుడ్ నటుల తీరును ఖండిస్తున్నట్టు తెలిపాడు. తమిళుల దాహార్తి తీర్చేందుకు అమ్మ చేస్తున్న కృషి అభినందనీయమని, ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారని కొనియాడాడు. కర్ణాటక ఆందోళనలు సరికాదని, కన్నడ చిత్ర పరిశ్రమ నటీనటుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నాడు. కావేరీ జలాల విషయంలో తమ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా చిత్ర పరిశ్రమ యావత్తూ అండగా ఉంటుందని స్పష్టం చేశాడు. తాజా పరిణామాలతో, నీటి వాడకం విషయంలో మొదలైన వివాదం, ఆపై రైతుల నిరసనలు, పోలీసుల కాల్పులు, సరిహద్దుల మూసివేత, ధర్నాల స్థాయి దాటి సినీ పరిశ్రమకు వ్యాపించినట్లయింది.