: ఢిల్లీలో అమానుషం.. కట్టుకున్న భార్యపైనే అనుమానం.. 24 సార్లు పొడిచి చంపిన భర్త


ఘోరాలకు నిలయంగా మారుతున్న దేశ రాజాధానిలో అటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యనే అనుమానించిన ఓ ప్రబుద్ధుడు ఏకంగా 24 సార్లు ఆమెను పొడిచి చంపేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆదివారం ఉదయం ఢిల్లోలోని వికాశ్ విహార్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఇ-రిక్షా డ్రైవర్ అయిన ప్రేమ్‌సింగ్ తన భార్య సుమన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో ఆమెను చంపాలని ముందురోజే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇందులో భాగంగా 8, 12 ఏళ్లున్న ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. వచ్చీ రావడంతోనే కూరగాయలు కోసే కత్తితో భార్యపై విచక్షణరహితంగా దాడిచేసి కడుపులో ఇష్టానుసారం పొడిచాడు. మొత్తం 24సార్లు ఆమెను కసిదీరా పొడిచాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలింది. అనంతరం తన చేతి నరాలను కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కింట్లోంచి అరుపులు వినిపించడంతో వెళ్లామని, గడియపెట్టి ఉండడంతో బద్దలు గొట్టి వెళ్లి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. ప్రేమ్‌సింగ్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. భార్యను హత్యచేయడానికి ముందు ప్రేమ్‌సింగ్ తాగి ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపారు. మర్డర్, సూసైడ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News