: ఫ్లెక్సీ-ఫేర్ విధానానికి సూపర్ రెస్పాన్స్.. సంబరపడుతున్న రైల్వే
ఇటీవల ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ-ఫేర్ విధానానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు భారత రైల్వే పేర్కొంది. డిమాండ్‌ను బట్టి రైలు టికెట్ల ధరలు పెంచుతున్నా ఇప్పటికీ విమాన చార్జీల కంటే తక్కువే ఉన్నట్టు పేర్కొంది. గత రెండు రోజుల్లో 30 శాతం బుకింగ్స్ వచ్చినట్టు తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ నెల 9 నుంచి ఫ్లెక్సీ-ఫేర్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 500 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా రైల్వే ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తొలి పదిశాతం టికెట్లను సాధారణ ధరకే విక్రయిస్తారు. ఆ తర్వాతి నుంచి ప్రతీ పదిశాతం టికెట్లకు పదిశాతం చొప్పున 50 శాతం వరకు ధర పెంచుకుంటూ పోతారు. ఈ సరికొత్త విధానం ద్వారా 9, 10 తేదీల్లో వరుసగా రూ.84, రూ.81 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్టు రైల్వే బోర్టు మెంబర్(ట్రాఫిక్) జంషెద్ తెలిపారు.