: అక్కడి ఆచారం.. వినాయకుడికి నైవేద్యంగా మాంసం, మద్యం!
విఘ్నాధిపతి గణేశుడికి ఉండ్రాళ్లు, పులిహోర, పరమాన్నం... ఇలా నైవేద్యం పెట్టడం మనకు తెలుసు. కానీ, మద్యం, మాంసం నైవేద్యం పెట్టే భక్తులు కూడా ఉన్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన సుమారు 100 కుటుంబాల వారు వినాయకచవితి రోజున ఆయనకు మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పిస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని కేవలం ఇంట్లో మాత్రమే పాటిస్తారు. ఈ విధంగా ఒక్కరోజు మాత్రమే కాకుండా వారం రోజుల పాటు మాంసాహారాన్ని వండి గణేశుడికి నైవేద్యంగా పెడుతుంటారు. ఈ సంప్రదాయం గురించి భాగ్యనగర్ గ్రామస్తులు మాట్లాడుతూ, ఇలా చేయడం ద్వారా గణేశుడు ఆనందిస్తాడని, తమకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని తాము విశ్వసిస్తామన్నారు. కేవలం కాయగూరలతో వండిన ప్రసాదంతో గణేశుడు సంతృప్తి చెందడని, అందుకే, కొబ్బరికాయలు కొట్టడంతో పాటు మాంసం, మద్యం కూడా నైవేద్యం పెడతామని చెప్పారు.