: అమ్మ కోసం నాడు చిన్న ప్లాట్ లోకి మారిన ఉర్జిత్ పటేల్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్, కొన్నేళ్ల క్రితం వరకూ తన తల్లితో కలిసి అధికారిక నివాసంలో ఉండేవారు. ఆ ఇంట్లో నాలుగు గదులుండేవి. అయితే, అన్ని గదులున్న ఇంట్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండటానికి తన తల్లి ఇబ్బంది పడుతోందని గమనించారు. దీంతో, తన తల్లి కోసం ముంబైలోని ఒక చిన్న ప్లాట్ లోకి మారారు. ఉర్జిత్ పటేల్ జన్మతః గుజరాతీ. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆయన కుటుంబం కెన్యాకు వలస వెళ్లింది. ఉర్జిత్ పుట్టి పెరిగింది కెన్యాలోనే. ఆయన విద్యాభ్యాసం చాలా వరకు ఇంగ్లండ్ లో సాగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి డిగ్రీ చేశాక, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ చేశారు. ఆ తర్వాత యేల్ యూనివర్శిటీ నుంచి ఎకనమిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. చదువు పూర్తవగానే ఐఎంఎఫ్ లో భారత్, అమెరికా, మయన్మార్, బహమాస్ డెస్కుల్లో ఐదేళ్ల పాటు ఆయన పనిచేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అభ్యర్థనపై డిప్యుటేషన్ పై రెండేళ్ల పాటు ఆర్బీఐ కు సేవలందించారు. ఆ సమయంలో భారత బ్యాంకింగ్, రుణ వ్యవస్థ, పెన్షన్ నిధులూ, విదేశీ మారకాలకు సంబంధించిన విభాగాల అభివృద్ధి కోసం పనిచేశారు. ఆర్బీఐలో డిప్యుటేషన్ పై పనిచేసిన సమయంలో ఉర్జిత్ చేసిన సూచనలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడ్డాయని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించడంతో మూడేళ్ల పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్ గా ఉన్నారు. బ్యాంకులపైన రుణాల భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టడంలో ఆయన సహాయపడ్డారు. ప్రభుత్వం తరపున పనిచేస్తూనే ప్రైవేట్ రంగంలోనూ ఉర్జిత్ తన ముద్ర వేశారు.