: ఎందుకిన్ని తప్పుడు కూతలు... హోదా వద్దనుకుంటే అప్పుడెందుకు అడిగావ్?: వెంకయ్యపై ఉండవల్లి నిప్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా జరిగిన ఘటనలపై ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుడు కూతలు కూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇప్పుడు హోదా వద్దని చెబుతున్న ఆయన, ఆనాడెందుకు అడిగారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదించిన వేళ, ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అడిగిన వ్యక్తి ఎవరో 10 కోట్ల మందికి తెలుసునని, వారందరినీ ఇప్పుడు హోదా అనవసరమని ఆయనే చెబుతున్నాడని, ఇంతకన్నా దుర్మార్గమైన చర్య మరొకటి ఉండబోదని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్న వెంకయ్యనాయుడిని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు. అత్యధిక ఆదాయం వస్తున్న హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చేశారు కాబట్టి, ఏపీకి హోదా ఇవ్వాలని నాడు నిర్ణయించామని, విభజనకు గురై నష్టపోయిన రాష్ట్రానికి, ప్రత్యేక హోదాను అడుగుతున్న ఇతర రాష్ట్రాలకూ సంబంధమేంటని ప్రశ్నించారు. హోదా ఇవ్వకుండా బీజేపీ నాయకులు రోజుకో మాట చెబుతున్నారని ఆరోపించారు.