: దమ్ము, ధైర్యం ఉంటే నన్ను కొట్టి తరిమించండి... 'కాపు ద్రోహి' అంటూ తప్పుడు మాటలు వద్దు ముఖ్యమంత్రి గారూ!: ముద్రగడ
కాపు సామాజిక వర్గానికి న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి ఎవరైనా నేతను ముందుండి నిలిపితే తాను పక్కకు తప్పుకుంటానని ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. తనను కాపు జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, "దమ్మూ, ధైర్యం ఉంటే, చేతనైతే తునిలాంటి మీటింగ్ పెట్టి నన్ను తరిమి కొట్టించండి. అప్పుడు మీ సత్తా చూపినట్లవుతుంది. అంతే తప్ప, ముద్రగడ కాపు ద్రోహి. కాపుల్లో చెడబుట్టాడని తప్పుడు మాటలు చెప్పించొద్దు ముఖ్యమంత్రి గారూ... ఒక్క అడుగు కూడా నేను వెనక్కు వేయను. ఇంటి వరండాలో కూర్చుంటాను. ఎంతమందితో కొట్టిస్తావో కొట్టించు. చెప్పులతో కొట్టాస్తారో... రాళ్లతో కొట్టిస్తారో మీ ఇష్టం. ఉన్నపళంగా ఆస్తి, అప్పులు వదిలేసి పోతాను. కానీ, మా సోదరులతో తప్పుడు ఆరోపణలు చేయించి, మా మధ్య తగవులు పెట్టకండి. ఇప్పటికే గ్రామాల్లో మూడేసి, నాలుగేసి గ్రూపులు తయారయ్యాయి. సిగ్గుమాలిన పని ఇది. మీ బతుకు కోసం, మీ కుర్చీని కాపాడుకునేందుకు మా జాతిని విడదీయ వద్దు. తప్పిది... క్షమించరాని నేరమని తెలియజేస్తున్నాను" అని ముద్రగడ నిప్పులు చెరిగారు.