: నా ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారు... అయినా నాకు అభ్యంతరం లేదు!: ముద్రగడ


కాపులకు న్యాయం చేస్తానన్న చంద్రబాబునాయుడు, తన హామీని వెంటనే నెరవేర్చుకుంటే, మరోసారి దీక్ష చేపడతానని కాపు నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఆపై జరిగే పరిణామాలకు చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. ఈ ఉదయం కాపు ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం తదుపరి ఎలాంటి కార్యాచరణకు దిగాలన్న విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపిన ఆయన, తన రోజువారీ కార్యక్రమాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు. తన ఫోన్ కాల్స్ ట్రాప్ చేస్తున్నారని, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. అయితే, బెదిరింపు ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తుండటం మంచిది కాదని, దీనివల్ల సమస్యలు పెరుగుతాయని అన్నారు. మాటిమాటికీ తమ కుల నాయకులతో తనను తిట్టిస్తున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని హితవు పలికారు. వేధింపుల్లో భాగంగానే తన కార్యకర్తలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్యానంతరం కాపులపై ఉగ్రవాదుల కోసం తయారు చేసిన టాడా చట్టాన్ని ప్రయోగించాలని కూడా చూశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News