: ఈ ఆరాట, పోరాట యోధులు నాడెక్కడున్నారో చెబితే బాగుంటుంది!: పవన్ కల్యాణ్ పై వెంకయ్య పరోక్ష విమర్శలు
"ప్రత్యేక హోదా, ప్యాకేజీల మధ్య సమన్వయం తెచ్చి, లాభ నష్టాలను అంచనా వేయడం అంత సులువేమీ కాదు. దీనికోసం నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఈనాడు ఈ ఆరాట పోరాట యోధులందరూ నాడు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎక్కడున్నారో చెబితే చాలా బాగుంటుంది. నన్ను తప్పుబట్టే వాళ్లందరూ అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేశారో ఒకసారి చెప్పాలి" అని పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా, పరోక్షంగా ఆయనను విమర్శిస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీజేపీ మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోవాలనే చెప్పిందని, హైదరాబాద్ తెలంగాణకు దక్కాలని, ఏపీకి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని వెంకయ్య తెలిపారు. పార్టీ విధానానికి తగ్గట్టుగానే తాము నడిచామని గుర్తు చేశారు. అది రాజకీయ వ్యూహమేనని, అవకాశవాద రాజకీయం అనడం తప్పని హితవు పలికారు. అందులో రాజకీయ అవసరాలు లేవని, దాని గురించి తెలియని వాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.