: సమైక్యాంధ్ర ఉండాలని పోరాడింది ఒక్క కేవీపీ మాత్రమే!: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా ఉండాలని గట్టిగా ప్రయత్నించింది ఒక్క కేవీపీ రామచంద్రరావు మాత్రమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఒక్క మాట పెట్టుంటే, ఇప్పుడీ రభస, రాద్ధాంతాలకు అవకాశం ఉండేది కాదని, నాటి కాంగ్రెస్ తప్పిదమే నేడు పెను సమస్యగా మారిందని అన్నారు. విభజన బిల్లుకు ఆమోదం పలికే వేళ, రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాను మాట్లాడుతుంటే, తన గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందన్నారు. ఒక్క కేవీపీ మాత్రమే, తాను విభజనకు వ్యతిరేకమని మొదటి నుంచి వాదిస్తూ వచ్చారని, మిగతా ఎంపీలంతా ఏదో ఒక దశలో రాష్ట్రం రెండుముక్కలైతేనే మంచిదని వ్యాఖ్యానించిన వారేనని వెంకయ్య అన్నారు. విడిపోతే నీటి విషయంలో పెను తగాదాలు వస్తాయని తాను ముందే ఊహించి, వివాదాలకు ఆస్కారం లేకుండా పాత ఒప్పందాలను గౌరవించాలన్న పదాన్ని చట్టంలో చేర్పించానని గుర్తు చేశారు. విభజన చట్టంలో కాంగ్రెస్ వాడిన పలు పదాలు కూడా సమస్యలను పెంచాయని ఆరోపించారు.