: దేశంలోనే పరిశుభ్రమైన రాష్ట్రాల్లో సిక్కిం ఫస్ట్.. జార్ఖండ్ లాస్ట్
సిక్కిం.. ఈశాన్య భారతదేశంలోని ఓ చిన్న హిల్ స్టేట్. ఇప్పుడీ రాష్ట్రం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఖ్యాతికెక్కింది. ఆ తర్వాత స్థానంలో కేరళ నిలిచింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్(ఎన్ఎస్ఎస్ఓ) గతేడాది నిర్వహించిన స్వచ్ఛత సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. మొత్తం 26 రాష్ట్రాల్లో 2015 మే-జూన్ మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 3,788 గ్రామాల్లో 73,176 గృహాలను అధ్యయనం చేశారు. స్వచ్ఛ్ సుర్వేక్షన్-గ్రామీణ్ 2016 పేరుతో నివేదికను విడుదల చేశారు. మిజోరం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హర్యాణా రాష్ట్రాలు పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో చోటుదక్కించుకోగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు అంతగా పరిశుభ్రతపై దృష్టి సారించడం లేదని తేలింది. సిక్కిం రికార్డు స్థాయిలో వందశాతం మంది టాయిలెట్లను వినియోగిస్తున్నారు. వీరిలో 98.2 శాతం గృహాలకు టాయిలెట్ సౌకర్యం ఉండడం గమనార్హం. ఈ విషయంలో కేరళ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మిజోరం, హిమాచల్ ప్రదేశ్ నిలిచాయి. చత్తీస్‌గఢ్‌లోని 21.2 శాతం గృహాల్లో టాయిలెట్లు ఉండగా, జార్ఖండ్‌లో మరింత అధ్వానంగా 18.8 శాతం టాయిలెట్లు మాత్రమే కలిగి ఉండి అట్టడుగు స్థానంలో నిలిచింది. పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ 12వ స్థానంలో నిలవగా 47.4 శాతం టాయిలెట్లతో జమ్ముకశ్మీర్ 17 స్థానంలో నిలిచింది.