: మరింతగా పెరిగిన భద్రతా సవాళ్లు: రాష్ట్రపతి ప్రణబ్ కీలక వ్యాఖ్య
భారత భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరిగాయని, 21వ శాతాబ్దంలో సెక్యూరిటీ సవాళ్లు సంప్రదాయ హద్దులను దాటాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ ను పరిశీలించిన ఆయన, ఆపై మాట్లాడుతూ, దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అనిశ్చితిలోకి నెట్టబడుతున్న దేశాల సంఖ్య పెరుగుతోందని, ఇంధన భద్రత, సముద్ర జలాల పరిరక్షణ క్లిష్టతరమైందని అభిప్రాయడ్డారు. మానవులు సృష్టించే సమస్యలతో పాటు సహజ ప్రకృతి ప్రకోపాలు సైతం సరిహద్దుల్లో సాయుధ జవాన్లకు సమస్యలను సృష్టిస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మరింత దృఢంగా పనిచేయాల్సి వుంటుందని అన్నారు. సవాళ్లను అధిగమించేందుకు యువత కదలాలని సూచించారు. యువ సైనికుల భుజాలపైనే వంద కోట్ల మంది భద్రత ఉందని గుర్తు చేశారు. ఇండియాకు స్నేహపూర్వక దేశాలైన ఆఫ్గనిస్థాన్, భూటాన్, ఫిజీ, పపువా న్యూగినియా తదితర దేశాలకు చెందిన అధికారులు ఈ పరేడ్ లో పాల్గొనడం తనకు సంతోషాన్ని కలిగించిందని ప్రణబ్ వ్యాఖ్యానించారు.