: పాక్ దుర్మార్గం... భారత్ కు అనుకూలంగా ఉన్నాడని బెలూచ్ నేత కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన సైన్యం!
తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలని నినదిస్తూ, నిరసనలు తెలుపుతున్న బెలూచిస్థాన్ ప్రాంతంలోని రాజకీయ నేతలపై పాక్ సైన్యం, భద్రతా దళాలు తమ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. పౌరులపై దాడులు చేస్తూ, వారిని కిడ్నాప్ చేసి నిర్బంధిస్తూ, ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది, బెలూచ్ లో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నసీరాబాద్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని, సాధారణ పౌరులను వేధిస్తున్నారని బెలూచ్ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి అబ్దుల్ నవాజ్ బుగ్తీ ఆరోపించారు. దేరా బుగ్తీ ప్రాంతంలో ఓ రాజకీయ నేత కుటుంబంలోని మహిళలు, చిన్నారులు సహా 19 మందిని పాక్ సైన్యం బంధించిందని ఏఎన్ఐ వార్తా సంస్థకు పంపిన వీడియో మెసేజ్ లో ఆయన ఆరోపించారు. ఇండియాకు అనుకూలంగా ఉండటమే సదరు రాజకీయ నేత చేసిన తప్పని చెప్పారు. ఇప్పటికే ఎంతో మందిని తీవ్ర చిత్ర హింసలకు గురిచేసిన పాక్ అధికారులు, చాలా మందిని సామూహికంగా హత్య చేశారని, అంతర్జాతీయ మీడియా, అగ్రదేశాలు తమకు సాయం చేయాలని అభ్యర్థించారు.