: కంపుకొడుతున్న గుజరాత్‌ను చూసేందుకు రండి.. బిగ్‌బీని ఆహ్వానించేందుకు సిద్ధమైన దళితులు
దుర్గంధ పూరితంగా తయారైన గుజరాత్‌ను సందర్శించేందుకు రావాలంటూ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఆహ్వానించేందుకు ఉనా దళిత్ అత్యాచార్ లాదత్ సమితి(యూడీఏఎల్ఎస్) ఆధ్వర్యంలో దళితులు సిద్ధమయ్యారు. ‘‘కుష్‌బూ గుజరాత్ కి’’, కుచ్ దిన్ తో గుజారియే గుజరాత్ మే’’ అనే ట్యాగ్ లైన్స్‌తో ఆ రాష్ట్ర పర్యాటక శాఖను ప్రమోట్ చేస్తున్న బిగ్‌బీని రాష్ట్రంలోని అసలు దుస్థితిని చూడాల్సిందిగా వేలాది పోస్టు కార్డులు రాసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఈనెల 13న నిర్వహించనున్న బహిరంగ సభ అనంతరం వేలాదిమంది దళితులు అమితా బచ్చన్‌ను గుజరాత్‌కు ఆహ్వానిస్తూ లేఖలు రాయనున్నట్టు యూడీఏఎస్ఎస్ కన్వీనర్ జిగ్నేష్ మేవాని పేర్కొన్నారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు బచ్చన్ అందమైన గుజరాత్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు దళితులను జంతు కళేబరాలను తొలగించేందుకు అడ్డుకుంటుండడంతో రాష్ట్రం కంపుకొడుతోంది. ఆయన(బచ్చన్) ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ ఉండి గుజరాత్ దుర్గంధాన్ని చూడాలి’’ అని మేవాని పేర్కొన్నారు.