: మన 'మందు'బాబులు తెలివి మీరిపోయారట!... వెల్లడించిన సర్వే
భారతీయులు ఇటీవల కాలంలో తెగ తాగేస్తున్నారట. అయితే తాగుడు విషయంలో మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారట. లైట్ విస్కీ, క్రాఫ్ట్ బీర్ల సేల్స్ పెరగడమే ఇందుకు పెద్ద ఉదాహరణ అని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. రమ్, ఓడ్కాలను విడిచిపెట్టి విస్కీ వైపు యువకులు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. 2014-15లో రమ్, ఓడ్కాల సేల్స్ గణనీయంగా తగ్గిపోగా విస్కీ సేల్స్ మాత్రం పెరిగింది. మారుతున్న కాలంతోపాటు వారి టేస్ట్‌లో క్రమంగా మార్పు వస్తోందని సర్వే పేర్కొంది. విస్కీ, బీర్ అమ్మకాలు పెరగడానికి ఇదే కారణమని తెలిపింది. యువకులు ఇటీవల ‘టకీలా’ అనే మద్యం వైపు చూస్తున్నారు. 2014-15లో వీటి అమ్మకాలు పదిశాతం పెరిగాయి. ‘‘గతంలో యువకులు ఎక్కువగా ఫ్రెండ్స్‌తో కలిసి విస్కీ, రమ్ తదితర వాటిని తీసుకునేవారు. అయితే తాము తాగినట్టు తెలిస్తే ఇంటి వద్ద తిడతారనే ఉద్దేశంతో ఇటీవల రూట్ మార్చారు. విస్కీ, రమ్ తదితర వాటికి బదులు వైన్, క్రాఫ్ట్‌బీర్‌లాంటివి తీసుకుంటున్నారు’’ అని ఇండియన్ వైన్ కంపెనీ ఫ్రాటెల్లీ వైన్స్ డైరెక్టర్ కపిల్ షేఖ్రీ పేర్కొన్నారు. ఇక వైన్‌లలో లైట్ వైన్ అమ్మకాలు 2014-15లో 17 శాతం పెరిగాయి. మామూలు ఓడ్కా అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉన్న వాటి జోలికి పోకుండా కాస్తంత తక్కువ ఉన్న డ్రింక్స్‌వైపు మందుబాబులు మొగ్గుచూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.