: బీజేపీ, టీడీపీ నేతలే హోదా కావాలంటారు.. వాళ్లే వద్దంటారు... నన్ను మాత్రం విమర్శిస్తారు, ఏమిటిది?: పవన్ కల్యాణ్
బీజేపీ, టీడీపీ నేతలే తనపై విమర్శలు చేస్తుంటారని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ఓ టీవీ చానల్ తో ఆయన మాట్లాడుతూ, 'ఈ రెండు పార్టీలకు చెందిన నేతలే ప్రత్యేకహోదా కావాలంటారు. మళ్లీ వారే ప్రత్యేకహోదా వద్దు, ప్రత్యేకప్యాకేజీ ముద్దు అని చెబుతుంటారు. వారు అన్నదే నేను అంటే మాత్రం మళ్లీ విమర్శలు చేస్తారు. తిడతారు' అన్నారు. 'సరే.. పోనీ, వారు చెప్పినట్టే నేను చెబుతున్నది అబద్ధమైతే... చంద్రబాబు కేంద్రం ఏమీ చేయడం లేదని, రాష్ట్రం కష్టాల్లో ఉందని ఎందుకు పదేపదే చెబుతున్నారు?' అంటూ ఆయన నిలదీశారు. చంద్రబాబునాయుడు చెబుతున్నట్టు ఆయన ప్రాక్టికల్ మనిషే అయితే ఈ రెండేళ్ల కాలం ఎందుకు వృధా చేశారని ఆయన అడిగారు. రెండేళ్ల ముందే ఈ ప్యాకేజీ తీసుకుని ఉండి ఉంటే... ఈ సమయం కలిసి వచ్చేదని ఆయన అన్నారు. "నన్ను ప్రతి ఒక్కరూ...ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదు అంటున్నారు. మరి చంద్రబాబునాయుడుకి వ్యాపారాలు లేవా? సుజనా చౌదరి వ్యాపారాలు చేయడం లేదా?... వ్యాపారాలు, వ్యాపకాలు మానేసే వీళ్లందరూ రాజకీయాలు చేస్తున్నారా?" అని ఆయన గట్టిగా అడిగారు. సభలు, సమావేశాలు ఈవెంట్ మేనేజర్లు నిర్వహించకుండా ఏ ఎమ్మెల్యే, ఎంపీ పందిళ్లు వేసి, జెండాలు కడుతున్నారని ఆయన నిలదీశారు. తనను విమర్శించే ముందు వారు వారిని ఓసారి సరిచేసుకోవాలని ఆయన సూచించారు. గాంధీజీలా ఎవరైనా అన్నీ వదిలేసి రాజకీయాలు చేస్తున్నారా? అని పవన్ అడిగారు.