: హోదా వద్దని టీడీపీ చెప్పినా, ఇవ్వమని బీజేపీ చెబుతున్నా...పోరాటం ఆగదు...సాధించే వరకు పోరాడుతా!: జగన్ స్పష్టీకరణ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి వ్యతిరేకంగా, ప్రత్యేకహోదాకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన బంద్ ను విజయవంతం చేసిన ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హైదరాబాదు పోతోంది, పరిశ్రమలు, అభివృద్ధి, అవకాశాలు పోతున్నాయి. ఏపీకి తీవ్ర నష్టం జరుగుతా ఉంది. ఉద్యోగం కోసం అంతా హైదరాబాదుకే వెళ్తున్నారు. ఈ పరిస్థితి మారాలనే లక్ష్యంతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని ప్రకటన చేసిన సంగతి వాస్తవం కాదా?" అని అడిగారు. అప్పుడు దగాపడ్డ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని, తెచ్చేస్తామని బీరాలు పలికిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత 'ప్రత్యేకహోదా అవసరమా? అదేమన్నా సంజీవనా? ప్రత్యేకహోదా ఉన్న నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ కి ఏం మేలు జరిగింది? ప్రత్యేకహోదా వల్ల ఉపయోగం ఏంటి?' అంటూ ప్రశ్నించడం న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అక్కర్లేదని చంద్రబాబు చెబుతున్న తరుణంలో, ప్రత్యేకహోదా ఇవ్వం అని బీజేపీ చెబుతున్న తరుణంలో బంద్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం తమ పోరాటం ఆపమని, హోదా సాధించేవరకు పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.