: శ్రీనగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం.. మరో ఇద్దరి మృతి.. 80కి చేరిన మృతుల సంఖ్య
ఉగ్రవాది బుర్హాన్ వని హతమయ్యాక కశ్మీర్‌లో చెలరేగిన కల్లోల పరిస్థితులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. అక్కడి వాతావరణం చల్లబడుతుందని భావించిన ప్రభుత్వం రెండు రోజుల పాటు భద్రతా బలగాలను కూడా తగ్గించింది. అయితే, ఈరోజు ఆందోళనకారులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‍లో కర్ఫ్యూ తరహా ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విధ్వంసం సృష్టించే విధంగా నిరసనలకు దిగారు. ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో భద్రతా దళాలు పెల్లెట్ బులెట్లను వారిపై ప్రయోగించారు. దీంతో ఒక ఆందోళకారుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోపక్క సోపియాన్‌లో టియర్ గ్యాస్ షెల్ తాకడంతో ఆందోళనకు దిగిన మరో యువకుడు మృతి చెందాడు. యువకుల మృతిపై స్పందించిన కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తి విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో వైద్యులు రోజంతా నిర్విఘ్నంగా తమ సేవలు కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, అల్లర్లలో మృతి చెందిన ఆందోళనకారుల సంఖ్య ఇప్పటికి 80కి చేరుకుంది. మరో 10 వేల మందికి పైగా ప్రజలు తీవ్రగాయాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.