: బ్యాంకింగ్ వ్యవస్థను సరైన మార్గంలో నడిపేందుకు రఘురాం రాజన్ సరైన చర్యలు తీసుకున్నారు: ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. చెన్నైలోని కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగాన్ని సరైన దారిలో నడిపేందుకు రాజన్ సరైన చర్యలు తీసుకున్నారని కితాబునిచ్చారు. బ్యాంకులకు పెరుగుతున్న మొండి బకాయిలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వరుస సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల పనితీరు అంత ప్రకాశవంతంగా, సుసంపన్నంగా లేవని ఆయన తెలిపారు. అలాంటి సమయంలో రాజన్ చేపట్టిన చర్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాకింగ్ రంగాలు సహేతుకంగా పని చేశాయని ఆయన కితాబునిచ్చారు. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంక్షోభంలో ఉండగా, భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండడం గురించి తనను చాలా మంది అడిగేవారని ఆయన తెలిపారు. దేశ స్థూల ఆర్థిక సూచీల బలంతో భారత ఆర్థిక వ్యవస్థ సహేతుకంగా, బాగా రాణించడం తనకు సంతోషాన్నిచ్చిందని ఆయన వెల్లడించారు.