: కాకినాడలో డాక్టర్‌కు పాదాభివందనం చేసిన పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటిస్తోన్న జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ ఓ డాక్టర్‌కి పాదాభివందనం చేశారు. పట్టణంలోని కిరణ్ ఆసుపత్రి వైద్యుడు సంకురాత్రి చంద్రశేఖర్ సమాజానికి చేస్తోన్న సేవలను గుర్తించిన పవన్ ఆయనకు పాదాభివందనం చేశారు. తన పర్యటన సందర్భంగా కిరణ్ కంటి ఆసుపత్రిని సందర్శించిన పవన్.. ఆసుపత్రి ఆవరణలో మొక్కను కూడా నాటారు. ఆసుపత్రిలో ఓ రోగిని పరామర్శించిన అనంతరం సంకురాత్రి చంద్రశేఖర్ ను పవన్ అభినందించారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయమైందని పవన్ అన్నారు. భార్యాబిడ్డల్ని కోల్పోయినప్పటికీ సామాజిక బాధ్యతను గుండెల్లో నింపుకున్న డాక్టర్ చంద్రశేఖర్ ఎంతో మంది రోగులకి కంటి చూపునిచ్చారని పవన్ అన్నారు. ఆయన చేస్తోన్న సేవ ఎంతో స్ఫూర్తిదాయకమని కితాబిచ్చారు. పవన్ డాక్టర్‌కి పాదాభివందనం చేయడాన్ని చూసిన సదరు ఆసుపత్రి సిబ్బంది, అక్కడే ఉన్న పవన్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. పవన్ డాక్టర్ పట్ల ప్రదర్శించిన తీరు ఆయన మానవతాదృక్పథానికి నిదర్శనమని పవన్‌ని కొనియాడారు. పవన్ కల్యాణ్‌ని ఎటువంటి ఈగో లేని వ్యక్తిగా అభివర్ణించారు.