: మూడు రోజుల పాటు రచ్చ రచ్చ చేశారు.. వైసీపీ సభలో ప్రవర్తించిన తీరుపై అధికారికంగా విజువల్స్ విడుదల చేసిన ప్రభుత్వ చీఫ్ విప్
మూడు రోజులు జరిగిన ఏపీ శాసనసభలో వైసీపీ నేతల తీరుని సూచించే విజువల్స్ ని స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమతితో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కొద్దిసేపటిక్రితం హైదరాబాదులో విడుదల చేశారు. పారదర్శకంగా సభ సాగాలని చూసిన ప్రభుత్వానికి తీవ్ర ఆటంకం కలిగించారని ఆయన చెప్పారు. వాళ్ల విధానం, వారి ప్రవర్తన బయట పడాలనే ఈ దృశ్యాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో రోజు శాసససభ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల చేష్టలు పరాకాష్టకు చేరాయని ఆయన తెలిపారు. ‘స్పీకర్‌పై దాడి చేశారు, మార్షల్స్‌ని కొట్టారు. మైకులు విసిరిపారేశారు, బూటు కాళ్లతో చైర్‌లను తన్నారు. మూడు రోజుల పాటు రచ్చ రచ్చ చేశారు. సభాపతి స్థానానికే రక్షణ లేకుండా సభ నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనసభలో చర్చ జరగడం వైసీపీ నేతలకి ఇష్టం లేదు. ఒక పార్టీకి ఫ్యాక్షనిస్ట్ అధ్యక్షుడయితే ఎలా ఉంటుందో ఈ దృశ్యాల ద్వారా తెలుస్తోంది’ అంటూ ఆయన దృశ్యాలను మీడియాకు చూపిస్తూ వివరించారు. వీటిని ప్రజలు, సభా హక్కుల సంఘం గమనించాలని సూచించారు.