: పవన్ కల్యాణ్ రాష్ట్ర విభజన జరిగాక 11 రోజులు అన్నం తినలేదట.. ఆ మాట తెలంగాణ ప్రజలకు బాధకలిగించదా?: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే ప్రయత్నంలో ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోదాతో వచ్చే ప్రయోజనాలను ఆంధ్రా పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిలకడలేని రాజకీయాలతో లాభం లేదని ఆయన అన్నారు. ఏపీకి ఏం కావాలో అక్కడి నాయకుల్లోనే స్పష్టత లేదని అన్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ, హోదాపై పద్ధతి ప్రకారం ముందుకెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న చందంగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రకే పరిమితమవుతుందని నిన్న కాకినాడలో చేసిన ప్రసంగం ద్వారా తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. 'పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగాక 11 రోజుల అన్నం తినలేదట.. తెలంగాణ ప్రజలకి ఆ మాట బాధ కలిగించదా?' అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రనేతలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పా, హోదా కోసం పోరాడడం లేదని, కలిసి సాధించుకుందామనే ధోరణిలో వారు లేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.