: గాంధీ జయంతి నుంచి దేశంలోని పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం
పర్యావరణానికి హాని తలపెడుతోన్న ప్లాస్టిక్‌పై నిషేధం విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వచ్చే గాంధీ జయంతి రోజు నుంచి దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద ప్లాస్టిక్‌ని బ్యాన్ చేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ మాట్లాడుతూ... కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చారిత్రక కట్టడాల సమీపంలో 100 మీటర్ల పరిధి వరకూ ప్లాస్టిక్ సంచులు, వస్తువులపై నిషేధం అమల్లో వుంటుంది. ఆయా ప్రదేశాలకు వచ్చే పర్యాటకులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి వద్ద ప్లాస్టిక్ వస్తువులు లేవని నిర్ధారించుకున్నాకే పంపిస్తారు. పర్యాటకులు తెచ్చుకునే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను సైతం రీ సైకిల్ కంటైనర్లలోనే వేసేలా చర్యలు తీసుకోనున్నారు.